భూపాళం ::: రాగం
పల్లవి::
మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యా
సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా
చరణం::1
ఆవులు పేయలకుఁగా నఱచీఁ బిదుకవలె
గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా
ఆవలీవలిపడుచు లాటలు మరగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా
చరణం::2
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ
గూడియున్నా రిదే మేలుకొనవయ్యా
తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము
యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా
చరణం::3
పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ-
గొలుకులు విచ్చి మేలుకొనవయ్యా
అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ
యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్యా
No comments:
Post a Comment