Sunday, June 4, 2017

సత్య హరిచంద్ర పద్యములు :వారణాసి

సత్య హరిచంద్ర పద్యములు :వారణాసి

బీమ్ పలాస్ :
దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించితిమి. చూడు.
గీ. భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీ తటసంభాసి వారణాసి
పావనక్షేత్రముల వాసి వారణాసి.

.
చ. అలయక గుళ్ళుగోపురము లన్నియు జూచుచు నప్పుమాటయే
తలపవు చేరువయ్యెనుగదా గడువంచు రవంతయేని లోఁ
దలపవు నా ప్రయాసము వృథాయగుచున్నది వెళ్ళబెట్టుమా
పెలుచన మా ఋణంబు నెగ వేయదలంచిన నేను బోయెదన్‌.


ఉ. పుట్టెడు నప్పుతోడ దల మున్గితి వింకొక పుట్టెడైన నీ
పుట్టి మునుంగ దింతయును బ్రొద్దున నీ మొగమింత సూచినన్‌
బుట్టదు యన్నమున్‌ మునిగి పోక యిఁకేమిటి? దీపముండగా
నెట్టన జక్కఁ బెట్టుకొన నేరకపోయె గురుండు వెఱ్ఱియై.


శా. ఏలీలన్‌ సవరింతు మా ఋణము కొంపే గోడియే నింత కూ
డే లేదేమిటి కింకఁ జంపెదవు పొమ్మీ మీకు నేనాటి బా
కీ లన్న నిన్ను గొట్టువాడెవడు? చిక్కెన్నీకు మాజుట్టు ప
త్రాలా? సాక్ష్యములా? నినున్‌ బలిమి మీదన్‌ రచ్చకీడ్పింపగన్‌.

శా. నీ కాతం డది యప్పు వెట్టినది కానే కాద యామౌని ని
న్నే కైసాచి మదర్థ మిమ్మనిన సొమ్మేకాని, యద్దానికై
నీ కన్నుంగవ దుమ్ము సల్లి యిట మున్నే రాజ్య సర్వస్వముం
జేకొన్నాడిక నేటి యప్పు నిజముం జింతింప నింతే కదా?


మ. జటినై నేననరాదు కాని విను నీ సత్యంబే నీ కొంప కిం
తటి చేటౌటకు మూల మిప్పటికినైనన్‌ మించిపోలేదు తీ
ర్చుట కేనాటి ఋణంబు మీకనిన దీఱున్నీకు మా బాధ! యం
తట నూరేగుము సత్తుచిత్త నుచు జింతన్‌ బాసి బైరాగివై.


సీ. వైదిక వృత్తి సంపాదింతు నంటివా యుడుగవు రాచపోకడలు నీకు
రాచఱికంబు శౌర్యమున దెత్తు వటన్న దెసమాలి యేవంక దిక్కులేదు
వణిజువర్తనముచే గణియింతు నంటివా యరచేత గుడ్డిగవ్వైన లేదు
వ్యవసాయవృత్తిచే సవరింతు నంటివా లేదు భూవసతి గోష్పాదమంత
గీ. ఇందు నేడేని వ్యాపార మందదగిన
యంత పున్నెంబు పుట్టిన నింత ధనము
గంటుకట్టునె యీ స్వల్ప కాలమునను
గడచు నీ నాటితోడ మా గడువుదినము.


ఉ. పుట్టిననాఁట నుండియును బొంకి యెఱుంగవు యే నెఱుంగు ది
ప్పట్టుని గూడులేని దురవస్థల నుంటివి గాన నీ మనం
బెట్టిదొ తెంపుచేసికొని యీ యుపదేశము నాలకింపు మే
నొట్టిడి కొం దసత్యమున కొప్పితివంచు వచింప నేరికిన్‌.


శా. మీనిప్పచ్చరముం దలంచి కరుణన్‌ మీ బాగుకై యింతగా
నేనేమో హితమున్‌ వచించితిని, మీ కే లేని యీ బాధ నా
కా? నీ పెన్మిటి నీ వెటైన విను నా కౌనేమీ! పోనేమి నా
స్నానంబో జపమో తపంబో సదను ష్ఠానంబొ యోజింపుమా.

మ. సరివారి న్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం, బనం
తర మాహారమునం దనిష్ట, మటుమీదన్‌ దేహజాడ్యం, బటన్‌
మరణంబే శరణంబు, పెక్కు దినము ల్మంచాన జీర్ణించి ఇం
తిరొ! యీ ప్రాణులకున్‌ ఋణవ్యథలకంటెన్‌ దుస్సహం బేరికిన్‌.

గీ. కాలగతి సర్వసంపద గోలుపోవ
మిగులు సిరి నాకు మీరును మీకు నేనె
బానిసగ నన్ను నే కలవానికేని
నమ్ముకొనుఁ డింక మౌని ఋణమ్ము దీఱు.

ఉ. అంతటి రాజచంద్రునకు నాత్మజవై కకుబంతకాంత వి
శ్రాంతయశోవిశాలుని త్రిశంకు నృపాలుని యిల్లు సొచ్చి భా
స్వంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాండ్ర మే
ల్బంతిని నిన్ను నొక్కనికి బానిసగా దెగ నమ్ముకొందునే?

 రాగం ; భూపాల
గీ. హృదయమున నెగ్గు సిగ్గులు వదలివేసి
దాసిగా నిన్ను నమ్ముకో దలచినాడ
వాడవాడల నిన్‌ గొనువారి నూర
వెదకికొన బోవుదుము జనవే లతాంగి!


రాగం : ఆరభి
సీ. జవదాటి యెఱుగ దీ యువతీలలామంబు పతిమాట రతనాల పైడిమూట
అడుగుదప్పి యెఱుంగ దత్తమామల యాజ్ఞ కసమానభక్తి దివ్యానురక్తి
అణుమాత్రమైన బొంకనుమాట యెఱుగ దీ కలుష విహీన నవ్వులకు నైన
కోపం బెఱుంగ దీ గుణవితాన నితాంత యొరులెంత తన్ను దూఱుచున్న సుంత
గీ. ఈ లతాంగి సమస్త భూపాలమకుట
భవ్యమణికాంతి శబలిత పాదుడైన
సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య
దాసిగా నీపెఁ గొనరయ్య ధన్యులార!


గీ. ధరణిలో దొంగతనములో దొరతనములో
భాగ్యవంతునకేదైన బాధలేదు
పెన్నిధి యదృష్టమున నిరు పేదవాని
కబ్బినను దొంగసొమ్మంట కబ్బురంబె?


మ. ఇటులెంతైన ధనంబు వచ్చినను రానీ గాధిరాట్సూతి నా
కెటు కష్టంబుల దెచ్చెనేనియును దేనీ దివ్యభోగంబు లె
న్నిటి నాకాజడదారి యిచ్చినను నీనీ, సత్యముం దప్ప నే
నిటు సూర్యుండటుతోచెనేని వినుడోయీ మీరు ముమ్మాటికిన్‌.

క. దంతావళంబు పయి బల
వంతు డొక్కండు నిలిచి పైకిన్‌ రతనం
బెంతటి దవ్వుగ రువ్వునో
యంతటి యర్థంబు నిచ్చి యతివం గొనుమీ!



చ. పదపద యంచు బెత్తమున బ్రాహ్మణుఁ డిట్లదలించు చుండినన్‌
బదమటు సాగకున్నది భవత్పద సారసభక్తి యందు నె
మ్మది వశమౌట, చంద్రకర మర్దన మందుచునుండినన్‌ బదిం
బదిగ మరందలోలయయి పద్మముఁ బాయని భృంగికైవడిన్‌.

సీ. కదలవే యని విప్రుఁడదలించుటకు మున్ను గనులార మీ మోముఁ గాననిండు
పదవేమి యని వటుండదలించుటకు మున్నె మీ నోటి నుడి తేనెలాననిండు
నడువవేమని విప్రుఁడడలు వెట్టకమున్నె పొడము మీ కన్నీరుఁ దుడువనిండు
సాగవేమని వటుల్లాగవచ్చుటకు ము న్నింపుగా మిముఁ గౌఁగిలింపనిండు
గీ. పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ!
కాలగతి మీకు దూరస్థురాల నగుచు
వెడలు కన్నీట బాదము ల్గడిగి మీకుఁ
బ్రణుతులిడుచున్న దాన సద్గుణ నిధాన!


గీ. గళమునం దాల్పవలసిన యలరుదండ
పాదమర్దన కొప్పించు భంగిగాగ
నఖిల సామ్రాజ్యభోగంబు లందఁదగిన
పట్టపుఁ దేవి నమ్మితే బానిసగను.


మ. కనుసన్నన్‌ బనికత్తెలెల్ల నిరువంక\న్‌ గొల్వ రాణించు జీ
వనమే కాని యెఱుంగ వెప్డుఁ బర సేవాకృత్య మా జన్మమున్‌
వనితా నేటికి నీకు నా వలన బ్రాప్తంబయ్యె నెట్లోపెదో?
ఘనదుర్దాంత దురంతదుస్సహమహోగ్ర క్రూర దాస్యంబునన్‌.

మ. తల్లి దండ్రుల్‌ మఱి వేర లే రిక సతీ! తద్దంపతుల్గాక నీ
కిల, వేమఱపాటు సెందకుసుమీ యీ విప్ర సేవాకృతిన్‌
దొలి నీ వొందిన భోగభాగ్యముల యందున్‌ జిత్తమున్‌ నిల్పకే
తలలో నాలుకగా మెలంగుము నెలంతీ! పిన్నలన్‌ బెద్దలన్‌.


మ. కొడుకా! కష్టము లెన్ని వచ్చినను నీకున్నాకు నాకీడులం
దెడబాటు ల్ఘటింయింపకుండు టొక మేలే యంచు నే సంతసం
బడితింగాని యెఱుంగనిన్నుఁ దెగనమ్మంజూపి హా లోహితా!
కడ కీనాటికి గాలసర్పమునకుం గైకోలుఁ గావించుటన్‌.
కడ కీనాటికి గాలకౌశికునకుం గైకోలుఁ గావించుటన్‌.

రాగం : కన్నడ
గీ. కాలవశమున గల్గిన కష్టచయము
లెల్ల వెంటనే నిలుచునే యేక రీతి
మిహిర మండలమును గప్పు మేఘరీతి
తూలిపోకుండునే యెల్ల కాలమటుల?

 రాగం : మాల్ కోస్
మ. కలికీ! ఱెక్కలురాని పిల్లలను సాకన్‌ గూటిలో నుండి మే
తలకై పోతొక చెంత బెంటియొక చెంతన్‌ బాఱ నీలోన బి
ల్లలఁ బామే గ్రసియించునో వలల పాలన్‌ జిక్కునో పున్గులీ
యిలపైఁ బ్రాణులకున్‌ వియోగమగుచో నెవ్వారి కెవ్వారలో?


మ: కనుదోయిన్‌ జడబాష్పము ల్దొరఁగ నాకై యేల వీక్షించెదో
తనయా! నేను మహాకిరాతుఁడ సమస్తద్వీప భూమండలీ
జననాథాళికి సార్వభౌముడవుగా జాల్నిన్ను నీ దాస్యపుం
బనికై యమ్మిన నాకు నెచ్చటిదయా ప్రారంభవిస్రంభముల్‌.

రాగం :భాగేశ్వరి
గీ. మీరు బిడ్డలఁ గని పెంచువారె యైనఁ
గడుపు కక్కుఱితిని నింతగా వచింతుఁ
బ్రేమ నీ బిడ్డలందొక బిడ్డగాఁగ
నరసి కొనుమయ్య వీనిఁ గృపాంబురాశి!
(లోహితు నొప్పగించును)



రాగం : భాగేశ్వరి
శా. ప్రత్యూషంబున లేచి నాథుని పదాబ్జాతంబుల్‌ వ్రాలుటో
పత్యుద్దేశ మెఱింగి బోనముల సంబాళించుటో రాకకున్‌
బ్రత్యుత్థాన మొనర్చి మెచ్చఁ దగు సేవల్‌ సేయుటో కాకిటుల్‌
ప్రత్యాఖ్యాన మొనర్తురమ్మ సతమున్‌ బత్యాజ్ఞకున్‌ గేహినుల్‌?
మఱియు,
మ. పడతీ! నేనొక పాటిగాను వచియింపన్‌ నీవిభుండెంత నీ
యడుగు దాటఁడ యేని బత్తి మిగులన్‌ హత్తించి బంగారమే
యొడలెల్లన్‌ దిగువేయునట్లుగను నీ వోరంక ప్రొద్దెల్ల మే
లడ పాలూనుము, కాళులొత్తు మటుగా దాసీవరుల్‌ వీచుమా.

ఉ. బత్తెము లేక త్రోవల విపత్తుల కోర్చుచుఁ దిండి కేనియున్‌
బొత్తుగా వాచిపోయి గృహమున్‌ విడి నీ వెనువెంట రాఁగ నీ
తొత్తునె యింతకంటెను గతుల్మఱి మాకిఁక లెవె యేరికిన్‌
మెత్తనివానిఁ జూచు నెడ మిక్కిలి మొత్తగఁ జిత్తమౌఁ గదా!

ఉ. ఆస దొరంగి ప్రాణముల కైన దెగించుచు నిట్టి బత్తెపుం
గాసుల నాసచే దరువు కానిగ నీ పయి ఘోరకాననా
వాస మొనర్చ నొప్పుకొని వచ్చుటె నాయుపకార మాతపో
భ్యాసికి నా వలెన్‌ వటుఁడెవం డిటు నెత్తురుకూటికొప్పెడిన్‌

గీ. విమలశీలను నిల్లాలి విక్రయించి
చేర్చిన ధనంబు నీ చేత జిక్కెను గద
అవని స్వశరీరమాత్ర వైభవుఁడ నగుచు
బ్రతుకు చున్నట్టి నేనెట్లు బత్తెమిత్తు?


క. అడియాస విడువు మిఁక నా
యొడలన్‌ జీవంబు లున్న వొదమిన్‌ విడువన్‌
జెడనెంచి తేని నినునా
బొడ నీ యడిదమున గోయ మీఁరో గొనుమీ.


సీ. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్‌ దాన మిచ్చిన యట్టి ధర్మ మూర్తి
నిజ యశశ్చంద్రికల్‌ నిఖిల దిక్కులయందుఁ బాఱఁజల్లిన యట్టి సారగుణుండు
ముల్లోకములను సమ్మోదింప భేతాళు మద మడంచిన విక్రమస్థిరుండు
అణుమాత్రమైన బొంకను మాట యెఱుగని యసమాన నిత్య సత్య వ్రతుండు
గీ. ఏడు దీవుల నవలీల నేలినట్టి
సాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి
బానిసీడుగ నమ్మంగఁ బడెడు కొనుఁడు
పౌరులార మహాధనోదారులార



చ. కలతఁ వహింపకయ్య కల కాలము కష్టము లుండబోవు కా
వలసిన కారణార్థము లవంబును దప్పునె? నా యకృత్యముల్‌
దలఁపున నుంచకయ్య విహితమ్ము ననున్‌ క్షమింపుమయ్య, నా
కలుషమె యింత కింత కధికమ్మయి నన్వధియింపకుండునే?


మ. కడకన్‌ గావలెనంచు సత్యఫలముం గాంక్షించి నీవే యొడం
బడి కైకొన్న విపత్తులం బరితపిం పన్‌ గూడదయ్యా కడుం
గడుదోసంబని నేనెఱింగియు వృథా క్రౌర్యంబునన్‌ నీ యెడన్‌
జెడుగు ల్సేయుట కెంత గుందితినొ నాచిత్తంబె తా సాక్షియౌ!

గీ. గురుతిరస్కృతి తగదనుకొనుట యొకటి
యతని కార్యంబు నెఱవేర్తుననుట యొకటి
యింత నిందకు నన్‌ ద్రోచె నేను జనినఁ
పాయ కది నిల్చు నెన్నిక కల్పములకైన

శా. ఏయే ధర్మము లాచరింప నగు నేయే క్షేత్రము ల్మెట్టనౌ
నేయే తీర్థములందుఁ గ్రుంక నగు నేయే దేవులం గొల్వనౌ
నాయీ పాపము దప్పిపోవుట కనంతా దీనబంధూ! కృపా
ళూ! యాపన్నుఁడ నీ వె దిక్కగుము కొల్తున్నిన్ను విశ్వేశ్వరా!


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...