Sunday, June 4, 2017

సత్యహరిచంద్ర నాటకము : కాటి సీను

సత్యహరిచంద్ర నాటకము : కాటి సీను


కలవారి యిండ్లలోపలి విధానము నెత్త-నరుగు దొంగలకు సిద్ధాంజనంబు
మగలఁ గూరుకనిచ్చి తెగి యంటుగాండ్రకై-తారాడు కులటల తార్పుగత్తె
అలవోక నలతి పిట్టలఁ బట్టి వేఁటాడు-పాడు మూకములకుఁ బాడి పంట
మసనంబులోన నింపెసలారు శాకినీ-ఢాకినీ తతుల చుట్టాల సురభి
రేలతాంగికి నల్లని మేలి ముసుఁగు-కమలజాండంబునకు నెల్ల గన్నుమూత
సత్యవిద్రోహి దుర్యశశ్ఛవికిఁ దోడు-కటికచీకటి యలమె దిక్తటములందు

సీ. కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది-ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు
కాఁబోలు వీరు విగత జీవబాంధవు-లడలుచుండిరి మహార్తారవములఁ
గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌-నెమకుచుండిరి కపాలముల కొఱకు
గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి-పలలంపు బువ్వంపు బంతి సాగెఁ
జిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ-గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి
నెటఁబెడీలను రవములే యొసఁగుచుండు-దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.

గీ. కాటిసుంకంబు చెల్లింపకయె శవాల
మసనమునఁ గాల్పరే కద మనుజులార?
కాఁపు లేదనుకొంటిరేమో పదండు
దళిత ఘోరారి యీ వీరదాసు గలఁడు.

రాగం : శ్యామా
శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌.

శా. కాలంపుం గతి నెప్పుడేది యెటు భోగ్యం బప్పుడప్పాటనౌ
నాలీలన్‌ మును సేతు శీతనగ మధ్య ప్రాచ్య సామ్రాజ్య హే
లా లీలానుగతిన్‌ జరించి యిపుడీలాగైన నా ప్రాప్తికిన్‌
నాలో నాకొకభంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతోన్‌.

మ. కుడవం గూటికి లేకపోయినను నీకున్‌ రాజసంబెంత హె
చ్చెడురా! ఛీ! తలకెక్కెనే పొగరు దాసీ పుత్ర యంచున్‌ సుతున్‌
పడద్రోయన్‌ గొడుకట్టె నా వదనమున్గన్నీళ్ళతో జూచె హా!
కడుపున్‌ ఱంపపుఁ గోఁతఁగోయునదియే గాయంబు గాకుండఁగన్‌.

సీ. విడలేక నీ వెనువెంట వచ్చెదనన్న-పౌరుల దుఃఖముల్బాసినావో
సరిరాచబిడ్డయౌ సతిని నిల్లాలిని-బ్రియ మారంగా సుఖపెట్టినావో
గడుపారఁ గన్న యా గొడుకును ముద్దుగాఁ-బెంచి ముచ్చటలఁ జెల్లించి నావొ
పుత్రవత్సలత నెప్పుడు నన్నుఁ బ్రేమించు-కులగురు నాజ్ఞలో మెలఁగినావొ
రవి మొదలుకొని నీదాఁక బ్రబలుచుండు-స్వకుల గౌరవములను గాపాడినావొ
చావకెందుకు ఛీ! హరిశ్చంద్ర! నీవు-బ్రతికియున్నావు జీవచ్ఛవంబ వగుచు.

నా దేవుం డను నాసతో నసువులన్భారంబుగా మోసి నే
నే దిక్కౌదని నమ్మియుండు సతి నాహీనస్థితిన్‌ గానమిన్‌
ఈ దౌర్భాగ్యపు గాటికాపరితనం బేపాటితన్‌ బ్రోచెడిన్‌.

శా. నానాటన్‌ బరిపాటి నా మది దురంతంబైన చింతాహతిన్‌
మానై రాయయి వజ్రమై స్వగుణ ధర్మంబైన చైతన్య లీ
లా నైజంబుఁ ద్యజించి నిర్వీకృతి మేళ్ళన్‌ గీళ్ళ నొక్కుమ్మడిన్‌
బూనున్‌ యోగి మనంబురీతి యపుడే పో శాంతి నా చింతకున్‌.

సీ. జలదమా! సుంత మార్బలికిన దోసమా-యెఱుగవా నీవు లోహితునిజాడ
పరుగెత్తకుము చక్రవాకీ! యేకడనైనం-గనుఁగొంటివమ్మ నా కన్నవానిఁ
గాసంత మెఱపించి మోసగించెదవేల-తోడురావమ్మ విద్యుల్లతాంగి
జలదపుఁ దెరఁబాసి వెలికి రండొక్కింత-తారలారా! నా కుమారుఁ జూప

మ. పని యేమున్నది నిన్ననన్‌ నడకలాఁ వక్రంబు లే ప్రొద్దు నీ
వనిలో ఘోరవిషంబు గ్రక్కుట జగత్ప్రాణాశనోద్వృత్తి పె
ట్టిన పేరే యదిగాక నాలుకలు రెంటిం దాల్చినా విట్టి నీ
కనుకంపా గుణముండునన్న నెటు సాధ్యంబౌను దర్వీకరా!

గీ. హృదయమున దుఃఖమింతేనిఁ పదిల పడదు
మఱతు నన్న సతీసుతుల్మఱపురారు
కంటి కిదియేమొ పలుమాఱు కానిపించు
నెక్కడో యున్న నాదు లోహితుఁడు నేఁడు


మ. చనుఁ బాలిచ్చినతోడనే నిదుర బుచ్చన్‌ బొత్తులందుంచి య
ల్లన జోకొట్టుచు నొక్కకేలఁ బెఱకేఁలన్‌ డోలికం బట్టి యూఁ
చిన నీతల్లియె యిప్పుడీ చితిపయిన్‌ జేసేత నిన్‌ జేర్చి హా!
యని దుఃఖించెడు దిక్కుమాలిఁ కొడుకా యన్యాయమింకేమనన్‌

గీ. ఈ నెలంత సుశీలగాఁ గానిపించుఁ
గారణాంతరమున నిట్టి కష్టదశను
జెందినట్లున్న దదికాక ముందు నేను
విన్నదియుఁ గానే యున్నది వెలది స్వరము.
అయినను విచారించిన దప్పేమి?

మ. పడతీ యెవ్వతెవీవు? ఱాలుగరగన్‌ వాపోవుచున్నావు నీ
కొడు కెద్దాన గతించె? నెవ్వరున్‌ నీకుం జుట్టముల్‌ లేరే యీ
నడిరే యొంటిగ నెట్లు వచ్చితి శ్మశాన క్షోణికిన్‌? జిత్ర మ
య్యెడు నీరీతి వచింపు మేడ్చి ఫలమేమీ! యూఱటం బొందుమీ.


గీ. అరయ నితఁడొక మహనీయుఁ డట్లు తోఁచు
నీతని వచోవిధం బెన్న నేమొ కాని
పరిపరివిధంబులను బాఱు హృదయవృత్తి
యింత దుఃఖంబునన్‌ గొంత శాంతి వొడము.

చ. పురుషవరేణ్య! నీ వెవఁడవో యెఱుఁగన్‌ మసనంబు లోపలన్‌
దిరిగెడు భూతనాధుడవొ దీనదశాకలనన్‌ గృశించు నన్‌
గరుణ ననుగ్రహించుటకుఁ గా నరుదెంచిన సిద్ధమూర్తివో
పరమదయాబ్ధి నే నవని పైఁ గొఱగాని యభాగ్య దేవతన్‌.


మ. అనఘా! ఎంతని విన్నవింపగలనయ్యా! రోళ్ళరోకళ్లదా
బాడిన నాదీన చరిత్ర మెల్ల నొకపాడిన్‌ జేసి యీ దేహమొ
క్కని సొత్తౌటఁ దలంచి ప్రాణముల బిగ్గంబట్టుటేకాక యే
మని జీవింతును దిక్కుమాలి కడుహేయంబైన దాస్యంబునన్‌?
పూజ్యుడా! ఈ దీనురాలికి నిప్పుడెవ్వరు తోడురాఁ గలరు? చూడు,
సీ. కొడుకా! యటంచు నా పడు నవస్థకు జాలి-గొని యేడ్చు నలదిశాంగనలె తోడు
తన జంటంబాసి మింటను గూవు కూవు మంచు-శోకించు నల చక్రవాకి తోడు
ననుఁ నూరడింప హోరని యేడ్చు లోక పా-వనియగు గంగా భవాని తోడు
నను జూచిఁ బొటబొట మని మంచు కన్నీరు-లఁగార్చు తీవెయిల్లాండ్రు తోడు
ఆపదలకై వారి నా యన్న వారి-దిక్కులేనట్టి నా వంటి దీనసతికిం
గాశీ విశ్వనాథుడే కలడు తోడు-కడమ తోడేడ నాకు నో కాటిఱేఁడ!

చ. అడవికి బోయిఁ గట్టెలఁ గుశాదుల దెమ్మను ఱేని యాన ని
య్యడ కరుదేర నాదు దురదృష్టముచే బెనుబాముచేత నీ
కొడుకున కీ నవాంగనజునకున్‌ మరణమ్ము ఘటిల్లెనయ్య నా
పడు దురవస్థ యేమనుచుఁ బల్కుదు? దుఃఖము పొంగి పొర్లెడున్‌

ఉ. ఈ యలివేణి నోట వచియించెడు నొక్కొక్కమాట యొక్క వ
జ్రాయుధమై పెకల్చెడు శిలాకృతియ గాంచిన నాదు మానసం
బీయమ మాటపొందికయు నెల్గుఁదెఱంగు యుదంతమెల్ల ని
స్సీ యనరాదుగాని స్పృహియించును జంద్రమతీ సతీ మణిన్‌
 

మ. దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌
మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా
కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే
వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?



సీ. పసిఁడిమేడలలోన వసియించు ప్రభునకా-కటకటా! యీ వల్లకాటి వసతి
కనుసన్న దొరలచేఁ బనులందికొను మీక-యీ నికృష్టపు మాలవాని సేవ!
అలరుఁ దేనియలతో నారగించెడు మీకా-యకట! శవాల పిండాశనంబు
జిలుగు బంగారు దుస్తుల ధరించెడు మీక-పొలుసు కంపొలయు నీ బొంతకోక!
కనుల మీ యిట్టి దుస్థితిం గనిన నాకుఁ-జావురాకున్న దెంతని సంతసింతు!


ఏమీ! నీవు చంద్రమతివా? అయ్యో! వీఁడు నా కొడుకు లోహితాస్యుఁడా! (కుమారునెత్తుకొని)
శా. హా! సూర్యాన్వయవార్థి కౌస్తుభమణీ! హా! సద్గుణాంభోనిథీ!
హా! సౌందర్యనిరస్త మన్మథశతా! హా! పూర్ణచంద్రాననా!
హా! సల్లక్షణ లక్షితాంగ లలితా! హా! మత్తభృంగాలకా!
హా! సేవాపరతోషిత ద్విజమణీ! హా! లోహితా! హా! సుతా!

సీ. మోయలేదింకను మూఁపు కాయలుగాయ-సర్వ సర్వంసహా చక్రతలము
ప్రాయలేదింక గర్వాయత్తుల జయించి-యఖిలదిక్కుల విజయాక్షరముల
నిలుపలే దింక సత్కులకాంతను వరించి-సింహాసనమున నీ చిన్ని సుతుని
సలుపలే దింక నిర్జరకోటి మెచ్చఁగా-నశ్వమేధాది యజ్ఞాదికములఁ
గన్న తల్లిదండ్రులగు మాకు నిన్ని నీళ్ళు-విడువవలసిన పనిగూడ నడుపలేదె
యిన్ని పనులున్నవే నీకు మన్నెఱేఁడ!-యెందుకీ జాడ? లేచిరా యందగాడ!

ఉ. అందఱి కెట్టివో స్వవిషయంబున నట్టివె కాటి చట్టముల్‌
నందనుఁడంచు వీనిఁ గరుణం గని యేలినవాని యాన మీ
ఱందగునా? సతీ కనికరమ్మున కింత యెడమ్ము లేదు మా
డం దొర కీక యిప్పు డిచటన్‌ జితిఁ బేర్చుట కేను కర్తనే?


మ. చతురంబోధి పరీత భూతధరిణీ సామ్రాజ్యసర్వస్వ సం
తత ధౌరేయుండవయ్యు నీ వొకని యింటం గూటికై బంటవై
యతి నైచ్యంబు వహించి దిక్కు సెడి యిట్లైనాడ వేమందు నీ
బ్రతుకీ నాటికి తెల్లవారె గద పుత్రా యిన్ని బన్నాలతోన్‌.

శా. నిన్నా పన్నగ ముగ్రతం గఱవ దండ్రిం దల్లిన్‌ జీరియే
మన్నావో యపుడెంత బాధపడితో హా! పుత్రకా! నాకునై
యెన్నో బన్నములందినావు తుదకిట్లేకాకివై పోవ నేఁ
గన్నారం గననైతి నీ యెడఁ గృతఘృత్వంబు పాటించితిన్‌.

శా. హా కాంతా! జగదేక పావనివి యీ యన్యాయపు న్నిందనీ
కా కల్పించుట? రాజు నిర్దయుడె యోగ్యాయోగ్యముల్సూడఁడే?
లోకంబంతయు నస్తమించెనె? దయా ళుండైన దేవుండు లేఁ
డే కాపాడఁగ? గర్మసాక్షి పయిలేడే సర్వముం జూడఁడే?


సీ. నీవేకదా నాకు నిఖిలేప్సితంబుల-నవగతంబు లొనర్చు కల్పలతవు
నీవుగదా నాకు నిత్యసత్యయశంబు-దరిచేర్చుచుండెడు ధైర్యలక్ష్మి
నీవెకదా ఘోర దావానలమునుండి-మమ్ము రక్షించిన మానవతివి
నీవె గదా మౌని ఋణబాధఁ దొలఁగించి-పరువు నిల్పిన యట్టి భవ్యమతివి
గీ. నీవెకా నానిధానంబ నీవెకావె-నాకులవిభీషణంబవు నీవెకావె
అమరునే నాకు వేయి జన్మములకైన-నిన్ను వంటి సతీమణి నెలఁతమిన్న?


పరమేశ్వరా! దీనబంధూ! దయాగుణసాగరా! విశ్వనాథా!
మ. ఇదియే నాకడసారి ప్రార్థనంబు తండ్రీ సర్వభూతేశ నే
నెద వే మోక్షపథంబుఁ గోరనిఁక నెన్నే జన్మముల్‌ నాకు నీ
వొదవుం జేయుదు వన్ని జన్మముల కెట్లో నిత్యసత్యవ్రతున్‌
సదసత్కార్యవిచారధీరుని హరిశ్చంద్రం బతిం జేయుమీ!

ఉ. కమ్మని యాలనేత మునుగన్‌ సవనాగ్నిని దృప్తిసేయు పు
ణ్యమ్ము సగమ్మణంగె మసనమ్మునఁ బీనుగు లంటుటన్‌ వివా
హమ్మున నేసతిన్‌ విడూవనంచు స్పృశించితో తచ్ఛిరమ్ము నా
కొమ్మను జంప నా సగము గూడ నశింపదే పాప హస్తమా!
ఖడ్గమా! నీ వెంత యపకృతికి బాల్పడుచుంటివి?

చ. విడిచితి రాజ్యమైన సరవిం గులకాంతనునైనం గన్న యీ
కొడుకును నైన! నిన్ను ననుజుంగతి జూచితి గాని ఖడ్గమా!
కడ కిటు వల్లకాటి కధికారము వచ్చిన యప్పుడైన నిన్‌
విడువనె యీ కృతజ్ఞతయు వీడి వధింతువె నా సతీమణిన్‌.

సీ. హృదయమా! సతికి నా ఋణమెల్ల సరిపోయె-నీ కేటియాశ యీ నెలత పైన
మోహమా! నీ కాలము గతించె మా చెంత-బ్రతుకు మెందేని దంపతుల పొంత
దుఃఖమా! నీ వున్న దొసగు తప్పదు మాకు-దొలఁగ పొమ్మింక నా తలపు వీడి
ఖడ్గమా! మానినీ కంఠరక్తము గూఁడ-జవి చూడఁ గలవు నిశ్చలతఁ గొనుము
గీ. సత్యమునకయి యీ హరిశ్చంద్రు వంశ
మంతరించెడు గాక శ్రీ హరుని మీఁద
మనసు గుఱిచేసి, హా! చంద్రమతీ! త్వదీయ
కంఠ మర్పింపు నీ పతి ఖడ్గమునకు.














































































































































































































































No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...