Monday, May 29, 2017

నరసింహ శతకం పద్యములు

పద్యం : 01  
 గార్దభంబునకేల కస్తూరి తిలకంబు? - మర్కటంబునకేల మలయజంబు?
శార్దూలమునకేల శర్కరాపూపంబు? - సూకరంబునకేల చూతఫలము?
మార్జాలమునకేల మల్లెపువ్వులబంతి? - గుడ్లగూబకునేల కుండలములు?
మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్‌? - బకసంతతికినేల పంజరంబు?

 ద్రోహచింతనఁ జేసెడు దుర్జనులకు - మధురమైన నీ నామమంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
పద్యం : 02
తల్లిగర్భము నుండి ధనము తేఁ డెవ్వఁడు - వెళ్లిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని - మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్త మార్జనఁ జేసి విఱ్ఱవీఁగుటె కాని - కూడఁబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దానధర్మము లేక దాఁచి దాఁచి

తుదకు దొంగల కిత్తురో దొరల కవునో - తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
 పద్యం: 03
బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని - మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి - ప్రాణముల్‌ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్‌ గప్పఁగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ - బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో

నాఁటి కిప్పుడె చేతు నీనామ భజన - తలఁచెదను జెవి నిడవయ్య! ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
 పద్యం: 04

ధరణిలో వేయేండ్లు తనువు నిల్వఁగబోదు - ధన మెప్పటికి శాశ్వతంబు గాదు
దారసుతాదులు తనవెంట రాలేరు - భృత్యులు మృతినిఁ దప్పించలేరు
బంధుజాలము తన్ను బ్రతికించుకోలేదు - బలపరాక్రమ మేమి పనికిరాదు
ఘనమైన సకల భాగ్యం బెంతఁ గల్గిన - గోచిమాత్రంబైనఁ గొనుచుఁబోఁడు

వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను - భజనఁ జేసెడివారికిఁ బరమసుఖము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...