రాగము: శ్రీరాగం -అదివో అల్లదివో హరివాసము
అదివో అల్లదివో హరివాసము
పదివేలు శేషుల పడగల మయము
| ॥పల్లవి॥ |
అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు-
నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము
| ॥అదివో॥ |
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
| ॥అదివో॥ |
కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపద రూపమదివో
పావనములకెల్లఁ బావనమయము
| ॥అదివో॥ |
No comments:
Post a Comment